ప్రజల ప్రాణాలే ముందు తర్వాతే వారి జీవనోపాధిని కాపాడండి: డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్



ప్రజల ప్రాణాలే ముందు తర్వాతే వారి జీవనోపాధిని కాపాడండి: డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్





కరోనా వైరస్ కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాదు, వారి జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ద్రవనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల ఉత్పన్నమైన సంక్షోభం మానవాళికి చీకటి రోజులుగా అభివర్ణించారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటమే ముఖ్యం, వారి జీవనోపాధిని కూడా కాపాడాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిలినా జార్జియోవా వ్యాఖ్యానించారు. సరైన సమతౌల్యతను సాధించడమం కష్టమైనా, తొలుత మహమ్మారిని నియంత్రణలోకి తేవడం, ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్దరించడం అత్యవసరమని అన్నారు.

ఈ మహమ్మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. వైరస్‌ను ఎదుర్కోడానికి ప్రపంచంలోని పలు దేశాలు లాక్‌డౌన్ విధించగా.. భూగోళంలోని సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 59 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 11 లక్షల మంది దీనికి బాధితులయ్యారు. ఒక దేశం తర్వాత ఇంకో దేశంలోకి వైరస్ విస్తరిస్తోందని, తత్ఫలితంగా సమాజం, ఆర్ధిక వ్యవస్థ స్తబ్దుగా మారిపోయాయని డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు టెడ్రోస్, జార్జియోవా సంయుక్తంగా రాసిన కథనంలో పేర్కొన్నారు.

‘కరోనా వైరస్ నుంచి ప్రజలనా లేదా వారి జీవన ప్రమాణాలను కాపాడాలనే గందరగోళంలో ఉన్నారని, ఇదంత తప్పుడు ఆలోచన.. ఏది ఏమైనా కోవిడ్-19‌ను నియంత్రించాలి. ఇదే సమయంలో వారి జీవనోపాధిని కాపాడాలి.. కరోనా ఎదుర్కోడానికి చాలా దేశాలు ముఖ్యంగా పేద దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది.. ఇలాంటి దేశాలు ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చుచేయాలన’ అని తెలిపారు.