దిల్లీ ప్రార్థనలపై విజయశాంతి కామెంట్స్.. అతనికి మాత్రం సూటి ప్రశ్న

జమాత్ ప్రార్థనల వల్ల పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. జమాత్ ప్రార్థనల గురించి ప్రస్తుతం భిన్న వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాల నేపథ్యంలో విజయశాంతి ఫేస్ బుక్, ట్విటర్ వేదికగా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మతాలకు సంబంధించిన ప్రస్తావన రావడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది మతాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు.


ఫేస్ బుక్‌లో విజయశాంతి స్పందిస్తూ.. ‘‘జమాత్ సదస్సుకు వెళ్ళి తిరిగివచ్చినవారి వివరాలు స్వచ్ఛందంగా తెలియచేయకపోవడం వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలకు వారే అడ్డుకట్ట వేయాలి. ఇది ఆ వ్యక్తుల, వారి కుటుంబ సభ్యులు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అవసరం. ఇది ఒక సమస్య. దీనిని యావత్ ఆ సమాజానికీ ఆపాదించే ప్రయత్నం కూడా తీవ్రంగా అభ్యంతరకరం. లక్షలాది బాధితులతో సతమతమవుతున్న అమెరికా, ఐరోపాల సమస్య చైనా వైపు గానీ లేదా అజాగ్రత్త వైపు సూచిస్తుంది కానీ, ఏ మతం వైపూ కాదు. కుల, మత, ప్రాంత వర్గ భేదాలకు అతీతంగా మనమంతా భారతీయులం. మనమంతా ఐక్యంగా ఉండాలి’’ అని ఫేక్‌బుక్, ట్విటర్‌లలో పోస్ట్ చేశారు.