గుడ్ న్యూస్.. ఉబెర్ ఉచిత క్యాబ్ సర్వీసులు.. వారికి మాత్రమే!

ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తాజాగా శుభవార్త అందించింది. ఉచిత సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సర్వీసులు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు విశేష సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రమే ఉచిత క్యాబ్ సేవల లభిస్తాయి. పలు మెట్రో నగరాల్లో ఈ ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటాయి.


ఉబెర్ వైద్య సిబ్బంది కోసం ఉచితంగా క్యాబ్ సర్వీసులు అందించడం కోసం జాతీయ ఆరోగ్య సంస్థ (నేషనల్ హెల్త్ అథారిటీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకునేందుకు, కరోనా పేషంట్లకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రయోజనం కలుగనుంది. ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి సురక్షితమైన రవాణా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబెర్ తెలిపింది.

శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న కరోనా వైరస్‌పై పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఉబెర్‌తో జతకట్టామని, వారికి ఉచిత ప్రయాణాన్ని అందిస్తామని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఇకపోతే ఈయన ఆయష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన సీఈవోగా కూడా ఉన్నారు.